- టీజీ ఆర్గానిక్ మొబైల్ యాప్ ప్రారంభం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తాండూరు, వెలుగు : ప్రతిఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని, భూమిని కాపాడుకుంటేనే భవిష్యత్ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వికారాబాద్ జిల్లా తాండూరులో సోమవారం జరిగిన రైతు వారోత్సవాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా టీజీ ఆర్గానిక్ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఎరువులను ఎక్కువ మోతాదులో వాడడం వల్ల నేల సారవంతం కోల్పోతుందన్నారు. తాండూరు ప్రాంతంలో కంది బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తుంటే... బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రాణహిత చేవెళ్లకు మళ్లీ ప్రాణం పోసి హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కోటపల్లి ప్రాజెక్ట్ నుంచి 14 గ్రామాల్లోని 10 వేల ఎకురాలకు సాగు నీరు అందించేందుకు రూ. 100 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.
అనంతరం జుంటుపల్లి సమీపంలోని పామాయిల్ తోటను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారి, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
